PM Modi: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) గుజరాత్ (Gujarat)లోని కచ్(Kutch)లో జవాన్లతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. క్రీక్ ప్రాంతంలోని తేలియాడే BOPలలో ఒకదానికి వెళ్లి భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించారు. ఆర్మీ యూనిఫామ్ ధరించిన మోడీ సైనికుల్లో నూతనోత్సాహం నింపారు. కచ్‌లోని క్రీక్ ఏరియా(Creek area)లోని లక్కీ నాలా వద్ద BSF, ఆర్మీ(Army), నేవీ (Navy) మరియు వైమానిక దళానికి (Air Force) చెందిన సిబ్బందితో కలిసి వేడుకలు జరుపుకోవడంపై మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో క్లిష్టమైన ప్రాంతానికి మోడీ చేరుకొని జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుర్భేద్యమైన పర్యావరణ పరిస్థితులు ఎదుర్కొంటూ దేశ రక్షణలో పాల్గొంటున్న సిపాయిలను ప్రశంసించారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూస్తే గర్వంగా ఉందని మోడీ ఈ సందర్భంగా కొనియాడారు. నిర్మానుష్య ప్రదేశాలలో కాపలా ఉంటూ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. దేశం కోసం విధులు నిర్వహిస్తున్న జవాన్లను చూస్తే గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోడీ వరుసగా 11వ సారి సైనికులతో కలిసి దీపావళి వేడకల్లో పాల్గొన్నారు.