Bangladesh
Bangladesh

Bangladesh: అక్కడ ఇక హిందువులను ఉండనీయరా?

  • బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న దాడులు
  • 22 నుంచి 7.5 శాతానికి తగ్గుదల
  • రిజర్వేషన్ల రగడతో గద్దె దిగిన హసీనా
  • యూనుస్ ప్రభుత్వ ఏర్పాటు
  • అయినా చల్లారని ఆందోళనలు
  • విద్యార్థి సంఘాలు, నిరసనకారుల హింసాకాండ
  • వందలాది మంది హిందువులు మృతి
  • ఆలయాలు, ఆస్తుల ధ్వంసం

Bangladesh: (మన బలగం – ప్రత్యేక ప్రతినిధి): బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. అక్కడ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తరువాత అక్కడి మైనార్టీల(హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు)పై దాడులు విపరీతమయ్యాయి. కొత్తగా ఏర్పడిన యూనుస్ ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడంలో పూర్తిగా విఫలమైంది. విద్యార్థి సంఘాలు, నిరసనకారుల దాడిలో వందలాదిమంది హిందువులు అసువులుబాసారు. ఆందోళనకారుల ఆలయాలపై దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేసారు. చిన్నా పెద్ద తేడా లేకుండా చిత్రహింసలకు గురిచేసారు. రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నా అక్కడి ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది.

పరిస్థితికి కారణమేంటి?
బంగ్లాదేశ్ విముక్త యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమంలో 200 మందికిపైగా అసువులు బాసారు. ఇందుకు బాధ్యత వహిస్తూ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం విస్తృతమైంది. నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. అధికార అవామీలీగ్ పార్టీ కార్యకర్తలు, ఆందోళనకారులకు మధ్య నెలకొన్న ఘర్షణలో 97 మంది మరణించారు. ఆందోళనల నేపథ్యంలో రిజర్వేషన్లను సుప్రీంకోర్టు 5 శాతానికి తగ్గించింది. అయినా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు.

కూలిన ప్రభుత్వం
ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఉధ‌ృతమయ్యాయి. కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది దేశ రాజధాని ఢాకాకు తరలివచ్చి లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హుటాహుటిన దేశం విడిచిపెట్టారు. కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకొని ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. హసీనా తప్పుకోవడంతో దేశపాలన పగ్గాలు సైన్యం చేతిలోకి వెళ్లాయి. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ పాలన బాధ్యతలు తీసుకున్నారు. హసీనా రాజీనామాతో దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ఆమె అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ఆక్రమించి విధ్వంసం సృష్టించారు. రిజర్వేషన్ల నిరసన సెగతో 15 ఏళ్ల హసీనా పాలనకు తెరపడింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే హసీనా సర్వస్వం కోల్పోయి దేశం వీడారు. హసీనా రాజీనామాతో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. పారిస్‌లో ఉన్న ఆయన హుటాహుటిన బంగ్లాకు చేరుకొని పాలనా పగ్గాలు చేపట్టారు.

ఆలయాలు, హిందువులపై దాడులు
హసీనా రాజీనామా చేయాలంటూ తలపెట్టిన ఆందోళనలో నిరసనకారులు వందల సంఖ్యలో ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులను విచక్షణారహితంగా హింసించారు. ఆస్తులను లూటీ చేశారు. ఇండ్లకు నిప్పు పెట్టారు. హిందువులతోపాటు ఇతర మైనార్టీ వర్గాలపై దాడులు పెచ్చరిల్లాయి. దాడులతో మైనార్టీలు (హిందూ, క్రిస్టియన్, బౌద్ధులు) భయాందోళనల నడుమ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యూనుస్ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని చెప్పినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

బంగ్లా వ్యాప్తంగా మారణహోమం
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమైన నాటి నుంచి 2024 నవంబర్ చివరి వరకు 600 మందికిపైగా హిందువులు, ఇతర మైనార్టీ వర్గాల వారు బలయ్యారు. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందువులు నిరసనలు చేపట్టారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చి తమకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బహిరంగంగా లేఖలు రాసారు. నూతన ప్రధాని యూనుస్ స్పందిస్తూ మైనార్టీలు మన దేశ పౌరులేనని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రకటించారు. అయినా హిందువులపై హింసాకాండ చలేరుగుతూనే ఉంది. మహిళలు, గర్భిణులు అని చూడకుండా బలితీసుకున్నారు. చిన్నారులు, విద్యార్థులు, యువతులను అతి కిరాతకంగా హతమార్చారు. వందలాది మంది హిందువుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విలేకరులను సైతం అంతమొందించారు. హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామా చేయించారు. 100కిపైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలపై దాడులకు పాల్పడి హిందూ ఉపాధ్యాయులతో బలవంతంగా రాజీనామాపత్రాలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వివిధ రకాలుగా ఆంక్షలు పెట్టింది. దసరా నవరాత్రుల్లో నమాజ్ వేళల్లో మైకులు బంద్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగీత వాయిద్యాల శబ్ధాలు సైతం చేయొద్దని నిబంధన పెట్టింది. నిశ్శబ్ధంగా పూజలు చేసుకోవాలని పేర్కొంది.
మోడీతో ఫోన్‌లో మాట్లాడిన యూనుస్
హిందువుల రక్షణ అంశంపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనుస్ ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాము, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పడూ ఉంటుందని’ ప్రధాని మోడీ తెలిపారు. హిందువులకు రక్షణ కల్పించాలని మోడీ యూనుస్‌ను కోరారు.

ఇస్కాన్‌పై నిషేధానికి కుట్ర
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మొయి కృష్ణదాస్‌ను ఈ ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇస్కాన్ సంస్థను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ కుట్రకు తెరలేపింది. బంగ్లాదేశ్‌లో హిందువుల హక్కులను కాలరాస్తూ వారిని దేశం నుంచి తరిమికొట్టడమే పనిగా పెట్టుకున్నారు. చిన్మొయి క‌ృష్ణదాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై జైలులో పెట్టారు. ఆయనను కలిసేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్‌లను సైతం అరెస్టు చేశారు. అంతేకాకుండా పలు చోట్ల ఇస్కాన్‌ సంస్థలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులను ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. అక్కడ హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. 200కు పైగా ఆలయాలను ధ్వంసం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీరి అరెస్టును భారత్ సహా మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. మరో వైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్కాన్ చీఫ్ చిన్మొయి కృష్ణాదాస్‌న విడుదల చేయాలని భారత్‌లో హిందువులు ఖండిచడంతోపాటు ఆందోళనకు దిగారు. త్రిపుర రాజధాని అగర్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోని పలు ఆస్పత్రులు కీలక ప్రకటనలు చేసాయి. కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రులు బంగ్లాదేశీయులకు వైద్యం చేయబోమని ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలై రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

శరణార్థిగా భారత్‌కు హసీనా
నిరసనకారులు, విద్యా్ర్థి సంఘాల ఆందోళనతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో తలదాచున్నారు. అమెరికా కట్ర చేయడంతోనే తాను పదవి నుంచి దిగాల్సి వచ్చిందని హసీనా పేర్కొన్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపం, బంగాళాఖాతంపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిచిందని, దీన్ని తాను తిరస్కరించానని అందుకే అమెరికా పగబట్టి తనను పదవి నుంచి దించే కుట్ర చేసిందని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వేలాది మంది దేశం వీడి వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో బంగ్లా-భారత్ సరిహద్దు గుండా అనేక మంది బంగ్లా పౌరులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. భారత్ సేనలు వేలాదిగా తరలివచ్చిన బంగ్లాదేశీయులను సరిహద్దు వద్ద అడ్డుకొని వెనక్కి పంపించేశారు. బంగ్లాదేశ్ అటార్నీజనరల్ మహ్మద్ అసదుజ్జమాన్ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ సుప్రీంకోర్టుకు వెళ్లారు. 90 శాతం ప్రజలు ఒకే మతానికి చెందిన వారు ఉన్నారని, 15వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పరిశీలించాలని కోరారు.

తగ్గుతున్న హిందువుల జనాభా
బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా మూడో వంతుకు తగ్గిపోయింది. 1951లో 22 శాతం మంది ఉన్న హిందువులు 2022లో 7.95 శాతానికి తగ్గిపోయారు. 77 శాతం ఉన్న ముస్లిముల జనాభా 91 శాతానికి పెరిగింది.
సం. – హిందువుల జనాభా
1951- 22 శాతం
1991-15 శాతం
2011- 8.5 శాతం
2022- 7.95

హిందువులపై గతంలోనూ దాడులు
హిందువులై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు దాడులు జరిగాయి. 1971లో బంగ్లాదేశ్‌ను సెక్యులర్ స్టేట్‌గా ప్రకటించారు. 1988లో ఇస్లామిక్ స్టేట్‌గా మారింది. ఆర్టికల్ 41 ప్రకారం ఇతర మతాలకు గుర్తింపు కోసం నిర్ణయం తీసుకున్నారు. 1950, 1971, 1990లో హిందువులపై దాడులు జరిగాయి. ఆలయాలపై దాడులు జరిగాయి. మహిళలపై అత్యాచారాలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *