- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలి
- మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు
- దిశా నిర్దేశం చేసిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్
BRS strategy for local body elections in Khanapur constituency: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా పాలనలో గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఇది రైతు మోసపూరిత ప్రభుత్వ అని, ఆరు గ్యారంటీలు అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులను గుండెల్లో పెట్టుకొని చుసుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి లేదని, సాధ్యం కాని దొంగ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మోసం చేసారని, ఈ విషయాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలకు చేసిన మోసాన్ని వివరించి, అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో ఖానాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లో బలంగా వినిపించాలని చెప్పారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలచి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నాయకులంతా సమన్వయంతో పని చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు సునాయసం అవుతుందని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామునాయక్, మాజీ ఎంపీపీ మోహిద్, నాయకులు రాజ్ గంగన్న, గౌరీకర్ రాజు, వాల్సింగ్, ప్రదీప్, శ్రావణ్, మహిపాల్ ఆయా మండలాల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.