Konda Laxman Bapuji Vardhanti celebrations Nirmal: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటం జరిపిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి పద్మశాలి కులస్తుడు కట్టుబడి ఉండాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘ నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిలుక రమణ మాట్లాడుతూ.. పద్మశాలి కుల సంక్షేమం, అభివృద్ధి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కులానికి అన్ని రంగాలలో మరింత ప్రాధాన్యత కల్పించాలన్నారు. పద్మశాలీల కులదైవం అయిన మార్కండేయ మహర్షి ఆలయాలను ప్రతి గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. పద్మశాలి యువతను ఆదుకునేందుకు స్వయం ఉపాధి పథకాల కోసం ప్రత్యేక ఆర్థిక కార్యాచరణ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఆడెపు సుధాకర్, జల్డ రాజేశ్వర్, మిట్టపల్లి నర్సయ్య, జల్డ గంగాధర్, గంగా సురేశ్, దత్తాద్రి, కిషన్, రాజేశ్వర్, బిట్లింగు నవీన్, పెండెం శీను, చిట్టన్న, భాను చందర్, నరహరి, మనోహర్, పండరి తదితరులు పాల్గొన్నారు.