Political leader trapped by unknown person
Political leader trapped by unknown person

Political leader trapped: ఏమీ సేతురా! లింగా!!

పొలిటికల్ లీడర్‌కే తడిగుడ్డ

Political leader trapped: ఆయనో నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి, మొన్ననే భారీ, అతి భారీ అని కాకుండా మోస్తరు ఓట్లతో బయట పడ్డడు. ఎంఏలు, పీహెడ్‌‌డీలు కాకుండా కొంచెం తక్కువే సదివిండు, గతంలో ఒకసారి గెలిచి, మళ్లీ ఓడి, మళ్లీ గెలిచి, ఇలా తన పొలిటికల్ కెరీర్‌ను సాగదీత్తుండు, తన కోసం పనిజేసిన చోటామోటా లీడర్లకు ఏదన్న జేద్దామని డిసైడ్ అయ్యిండు, సెక్రెటరీని పిలిచి ‘మన పోరగాళ్లకు ఏమన్న జేయాల్నయ్యా!’ అని తన మనసుల మాట జెప్పిండు. ‘అందర్ని కాకున్నా కొందర్నన్నా సెట్ చేద్దాం సార్’ అని సెక్రెటరీ చెప్పుడుతోని గుండెలపై భారం దిగినట్లు ఫీలైండు. అనుకున్నట్లుగానే అందర్ని సెట్ జేసే టైమొచ్చిందన్నట్లు సింబాలిక్‌గా సెక్రెటరీ ఫోన్ రింగ్ అయ్యింది. మంచి శకునం అని అనుకున్నడు. ఫోన్ ఎత్తంగనే ‘హలో నేను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అదనపు కార్యదర్శిని’ అనంగనే ‘సార్ సార్ చెప్పండి సార్’ అంటూ వినయంగా రిసీవ్ చేసుకున్నడు సెక్రెటరీ.

‘మన ముఖ్యమంత్రి కొత్త స్కీమ్ చాల్ జేసిండు. నిరుద్యోగ యువత కోసం రుణ పథకాన్ని తీసుకొచ్చిండు. మీ నియోజకవర్గం నుంచి వంద మందిని సెలెక్ట్ జేసి లిస్టు పంపండి. ఒక్కో బెనిఫిషరీ మూడు వేల ఆరు వందల రూపాలు లబ్ధిదారు వాటా కింద కట్టాలె. దరఖాస్తును బట్టి లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షలు ప్రభుత్వం రుణం మంజూరు జేస్తుంది.’ అని సమాచారం అందింది. ‘మన పోరగాళ్లను సెట్ జేద్దాం.’ అని సార్ చెప్పిన మాటలు సెక్రెటరీకి గుర్తుకొచ్చినయ్, మండల లీడర్లకు కబురు అందింది. ‘మీ మండలం పది మంది ఉత్తములను లోన్ కోసం సెలెక్ట్ జేసి పంపండి.’ అని దాని సారాంశం.

మనకు బీ మంచి రోజులొచ్చినయ్ అన్నట్లు మండల లీడర్లు తమ ఆప్తులను సెలక్ట్ జేసి లిస్టు రెడీ చేసి సెక్రెటరీకి పంపిండ్రు. అన్ని మండలాల నుంచి మొత్తం వంద మంది జమైండ్రు. ఎంటనే సెక్రెటరీ ఫైనాన్స్ సెక్రెటరీ అదనపు కార్యదర్శికి ఫోన్ చేసి ‘సార్ మీరు జెప్పినట్లు వంద మంది లిస్టు రెడీ జేసినం.’ అని జెప్పిండు.‘మీకో బ్యాంకు ఖాతా నంబర్ పంపిస్తాం. లబ్ధిదారుల వాటా డబ్బులు అందులో జమ జేయండి. త్వరలోనే లిస్టు చెక్ చేసి లోన్లు మంజూరయ్యేటట్లు జూస్తా.’ అని సమాధానం రావడంతో సెక్రెటరీ సంబురవడ్డడు. ఈ పని పూర్తయి అందరికీ లోన్లు అత్తె సార్‌కు నా మీద ఇంప్రెషన్ పెరుగుతదని మనసులో అనుకున్నడు. ‘గాల్లో తేలినట్లుందే’ అనే పాట గూడా వాడుకున్నడు.

ఫైనాన్స్ సెక్రెటరీ అదనపు కార్యదర్శి చెప్పినట్లు వంద మంది లబ్ధిదారుల వాటా డబ్బు అక్షరాలా మూడు లక్షల అరవై వేల రూపాయలు ఖాతాలో జమ జేసిండు. హమ్మయ్య, పనిపోయినట్లే లోన్లు అత్తె జర మా సార్‌కు మంచి ఇంప్రెషన్ అత్తదని లోలోపల అనుకున్నడు. అప్డేట్ కోసం ఫైనాన్స్ ఆఫీసర్‌కు ఫోన్ జేసిండు. ‘మీరు డయల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా మనుగడలో లేదు’ అని తెలుగు, హిందీ, ఇంగ్లీషులో వినిపించే సరికి సెక్రెటరీ మైండ్ బ్లాంక్ అయ్యింది. నెత్తి మీద పిడుగు వడ్డట్లు అయ్యింది. ‘ఏమీ సేతురా లింగా..!..’ అన్న ట్యూన్ చెవుల్లో గుయ్ య్ మంటూ వినిపించే సరికే మతిపోయింది.

చేతిలో ఉన్న ఫోన్ జారిపోతుంటే టక్కున అలర్ట్ అయ్యిండు. మెల్లగా తేరుకున్నడు. ‘ఇప్పుడేం చేదాం వాట్ నెక్స్ట్’ అన్నట్లు మొఖంలో క్వశ్చన్ మార్క్ ఎక్స్‌ప్రెషన్ పెట్టిండు. ఇదేదో కొంపముంచే యవ్వారంలా ఉందని తనకంటే సీనియర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి సలహా అడిగిండు. ‘అంతే సంగతులు.. క‌ృష్ణార్పణమే!’ అన్న మాటలు వినంగనే ‘హత విధి అమంగళం ప్రతిహతమగును గాక’ అని మనసులో అనుకున్నడు. డబ్బులు గోవిందా గోవిందా అనే రీసౌండ్‌తో మైండ్ మూడ్ అవుట్ అయినట్లు అనిపించింది. ‘సాంప్రదాయినీ సుబ్బినీ సుద్దపూసనీ’ అన్నట్లు ఒకటో తరగతి పోరగాడు మార్కులు రాక బిక్క మొహం ఏసినట్లు దిగాలుగా విషణ్ణ వదనంతో సెక్రెటరీ సార్ దగ్గరకు పోయిండు. అరె ఏమైంది గట్లున్నవ్ ఏమన్న ప్రాబ్లమా అన్నట్లు సైగ జేసుకుంట అడిగిండు. ‘అది అది’ యెహే గుణుక్కోకుండా అసలు విషయం చెప్పయ్యా అంటూ గట్టిగనే అడిగిండు.

‘అదే సార్, మొన్న మనం వంద మంది లబ్ధిదారుల కోసం కట్టిన డబ్బులు పోయినట్టే సార్ అదంతా బోగస్ సార్’ అనంగనే లీడర్ సాబ్‌కు ఏం జేయాల్నో అర్థం కాలే‘అరె ఏందిబై నీకు ఆ మాత్రం తెల్వదా అన్న‘ ఎక్స్‌ప్రెషన్ పెట్టిండు. ‘సర్లే ఎన్నెన్నో అనుకుంటం అనుకున్నవన్నీ జరుగుతయా’ అన్న బాలయ్యబాబు డైలాగ్ గుర్తుకొచ్చి తేరుకున్నడు. ‘ఏం జేద్దాం సార్’ అన్నట్లు సెక్రెటరీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిండు.‘పోలీసులకు కంప్లైంట్ ఇయ్యు అదిగూడ నేనే జెప్పాల్నా’ అన్నట్లు ఎగాదిగా సూసిండు. తేలుకుట్టిన దొంగలెక్క సెక్రెటరీ అక్కడి నుంచి జారుకున్నడు. నేరుగవొయి పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసున్నడు. అయితే మన తెలంగాణ పోలీసు ఈ తాపకు బాగానే పనిజేసిండ్రు. ఈ పనిజేసినోడు ఎవడా అని ఆరా దీసుడు షురూ జేసిండ్రు. మొత్తం మీద ‘నాయుడు’ అనే బద్మాష్ గాడని తెలుసుకున్నరు. ఎంటనే పట్టుకొచ్చి లోపలేసిండ్రు.
కొసమెరుపు: నాయుడు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులను మోసం జేసిండు. ప్రజాప్రతినిధులను మోసం జేసుడే హాబీగా పెట్టుకున్నడు. లీడర్లను మోసం జేసిన పట్టుబడడం ఇది 38వ సారి అట.

sign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *