ACB Raid: నిర్మల్, డిసెంబర్ 4 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ రూ.7వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌లోని బుధవార్‌పేటకు చెందిన వెంకటి అనే యువకుడు దడువాయి లైసెన్స్ కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటివరకు లైసెన్సు ఇవ్వకపోగా లైసెన్స్ మంజూరు కావాలంటే రూ.10 వేలు ఇవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం వెంకట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో పట్టుకున్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో ముగ్గురు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.