prajavani: నిర్మల్, నవంబర్ 25 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 95 శాతానికి పైగా సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. షిఫ్టుల వారీగా డేటా నమోదు ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.