Purchase of grain: నిర్మల్, నవంబర్ 25 (మన బలగం): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె తనఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించాలన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తిచేసి, ధాన్యానికి సంబంధించిన రసీదుని ఇవ్వాలన్నారు. కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేసి పలు కీలక సూచనలు చేశారు. అన్ని రకాల రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే రైతుల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు గాను వారి ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను తీసుకోవాలన్నారు. సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలో మేరకు మాత్రమే ధాన్యం తూకం వేయాలన్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్యాడి క్లీనింగ్ యంత్రాల ద్వారా వరి ధాన్యాన్ని శుభ్రపరచడం ద్వారా తరుగు రూపంలో నష్టం రాదని కలెక్టర్ రైతులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే సహాయ కేంద్రానికి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునన్నారు. ధాన్యపు లారీలను వెంట వెంటనే గోదాములకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం వేణుగోపాల్, డిసిఓ రాజమల్లు, తహసిల్దార్ సంతోష్, ఎంపిడిఓ గజానంద్, అధికారులు, రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.