- ఫీజుల పేరిట విద్యార్థులకు వేధింపులు
- జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
- విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
Student protest: కరీంనగర్, మార్చి 6 (మన బలగం): కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యుగేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ జిల్లాలోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో ఎలాంటి ఫీజులు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పి, తీరా జాయిన్ అయ్యాక మెరిట్, ఫ్రీ సీటు పొందిన విద్యార్థుల నుంచి అక్రమంగా కళాశాల యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల గురించి ఒత్తిడి చేస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదనపు భారం విద్యార్థులపై యాజమాన్యం మోపకూడదని, ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని కోరారు. ఫీజులు కడితేనే మిడ్ ఎగ్జామ్‌కు అనుమతి ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని, కలెక్టర్ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.