- అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్టు
- బంగారం, వెండి, గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ గంగారెడ్డి
thief arrested: గత కొన్ని రోజులుగా నిర్మల్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గజదొంగను వలపన్ని పట్టుకున్నట్లు నిర్మల్ డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హర్యానా రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అబ్బాస్ సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మల్ వచ్చి గాజులపేటలో స్థిరపడ్డాడు. నిర్మల్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దినంలో కూరగాయల షాపులో పనిచేసుకుంటూ రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నాడు. దీంతో అప్రమత్తమైన సీసీఎస్ టీం సాంకేతిక ఆధారాలతో చోరీలకు పాల్పడుతున్న మహమ్మద్ అబ్బాస్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు పట్టణంలోని ఖిల్లా గుట్ట, సోమార్పేట, పింజారి గుట్ట, కూరాన్నపేట ఖానాపూర్‌లలో చోరీలకు పాల్పడ్డాడని వివరించారు.
నిందితుని నుంచి 150 గ్రాముల గంజాయి, రెండు తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, గ్రామీణ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సై రమేశ్, సాయి కృష్ణ, ఎం రవి, గోపి, అశోక్, సతీశ్‌లను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఇళ్లకు తాళాలు వేసి ఎవరైనా గ్రామాలకు వెళ్లినట్లయితే పక్క వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.