- ఆయిల్ ఫామ్, అమృత్ స్కీం పనులకు అడ్డంకులు
- తిరోగమన దిశలో నిర్మల్ నియోజకవర్గం
- ఆర్డీవో కార్యాలయం ముందు ఆయిల్ ఫామ్ రైతులతో ధర్నా
Former Minister Allola Indrakaran Reddy: నిర్మల్, మార్చి 7 (మన బలగం): నిర్మల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు తాను ఎంతో కృషి చేశానని, ప్రస్తుత నిర్మల్ ఎమ్మెల్యే అభివృద్ధి నిరోధకుడిగా మారాడని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన హయాంలో చేపట్టిన పనులకే కొబ్బరికాయలు కొడుతూ కాలక్షేపం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది 15 మాసాలు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో చిల్లి గవ్వ అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఎమ్మెల్యే అనుచరులే సండే ఎమ్మెల్యే అని ఆరోపించేవారని, ఇప్పుడు నెలలో రెండు రోజులు మాత్రమే నిర్మల్‌లో ఉంటున్నాడని ప్రజలే ఆరోపిస్తున్నారని మంత్రి అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు
నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మహేశ్వర్ రెడ్డి శాసనసభ పక్ష నేతగా హైదరాబాద్‌కే పరిమితి కావడం వల్ల నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అన్నారు. తాను పదేళ్లు మంత్రి పదవిలో కొనసాగినప్పటికీ ఎప్పటికీ నిర్మల్ ప్రజలకు అందుబాటులో ఉండే వాడినని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య ఎదురైనా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టకపోగా జరగాల్సిన అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేయడం వల్ల నిర్మల్ నియోజకవర్గం తిరోగమన దిశలో ఉందని మాజీ మత్రి ఆరోపించారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అడ్డంకులు
నిర్మల్ నియోజకవర్గంలో చేపట్టే అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అడ్డంకిగా మారాడని మాజీ మంత్రి ఆరోపించారు. పాక్ పట్లలో నిర్మించతలపెట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, అమృత్ స్కీం, చెక్ డ్యాం, టూరిజం పనులకు నిర్మల్ ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఏడాది లోపు ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైందని, ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాల్లో 1600 మంది రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఆఖరి వరకు పంట చేతికి వస్తుందని, ఇప్పటివరకు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే అడ్డుపడడం వల్లే ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కావడం లేదని అల్లోల ఆరోపించారు.
ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా
ఆయిల్ ఫామ్ రైతులతో ఈ నెల 10న (సోమవారం) ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పాక్ పట్లలో నిర్మించ తలపెట్టిన ఆయిల్ ఫామ్ పనులకు ఎన్వోసీ రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఆర్డీవో కార్యాలయం ముందు నియోజకవర్గంలోని ఆయిల్ ఫామ్ రైతులతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని అన్నారు. ధర్నా కార్యక్రమానికి నిర్మల్ జిల్లాలోని ఆయిల్ ఫామ్ రైతులందరూ ఉదయం 10 గంటలకల్లా హాజరుకావాలని సూచించారు.