- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్టు చేయాలి
- తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య
Tudumdebba: నిర్మల్, జనవరి 29 (మన బలగం): ఖానాపూర్ నియోజవర్గంలో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జ పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మత కలహాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య అన్నారు. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 30 సంవత్సరాల తర్వాత ఆదివాసులకు వచ్చిన అవకాశాన్ని జీర్ణించుకోలేని కొందరు ఈ రకమైన దాడి చేస్తున్నారన్నారు. మనుషులను విభజించి పాలించే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఇర్ఫాన్ అనే వ్యక్తితో పాటు వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఎండీసీ వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియాలో ఖానాపూర్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆదివాసుల గెలుపును ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబం నుంచి రావడం వారు జీర్ణించుకోలేక ఈ విధంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాయని హెచ్చరించారు. 9 తెగలతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. మతాలు, వర్గాలను విభజించే ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అల్లర్లను సృష్టించే వ్యక్తులు తయారవుతారని అన్నారు. కార్యక్రమంలో మన జిల్లా కార్యదర్శి మంద మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకగారి జాన్ సత్య (నర్సయ్య) తదితరులున్నారు.