CPI: కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎంతోమంది నిరుపేదల ఆరాధ్య దైవం చామనపల్లి గ్రామానికి చెందిన చోక్కారావు పేరును కరీంనగర్ మండలానికి నామకరణం చేసి ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు. బుధవారం సిపిఐ కరీంనగర్ మండల 8వ మహాసభ మండల కార్యదర్శి సాయవేని రాయ మల్లు అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కరీంనగర్ మండలమే కాకుండా జిల్లాలోని ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం భూమి లేని నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పార్టీకి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి చామనపల్లి చోక్కారావు ఈ గ్రామంలో పుట్టడం ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. చోక్కారావు నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శనీయవంతుడని ఆయన లాంటి నేత ఈ ప్రాంత ప్రజలను నిజాం రజాకార్ల చెర నుంచి రక్షించాడని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందని పేదవారికి కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ఉద్యమిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడే పార్టీ సీపీఐ అని, తిండి లేని వారికి అండదండగా ఉంటూ ఇంటి స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, నీటి సౌకర్యం, భూమికోసం అనేక పోరాటాలు చేసి వందల మంది కార్యకర్తలను జైలు పాలు అయ్యారని అలాంటి త్యాగం చేసిన పార్టీ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీయేనని పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో పేదవాడు పేదవాడి గానే, ఉన్నవాడు ఉన్నవాడిగానే మిగిలిపోయారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేస్తోందని, మతం పేర మారణహోమం సృష్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందని కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మండల మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మెరుగు కొమరయ్య, ఇరుకుల్ల బాబు, తోట ఆంజనేయులు, బుర్ర రాజయ్య, కాశ వేణి సతీష్, నెల్లి రవీందర్, బుర్ర కుమారస్వామి, రాములు, నాంపల్లి, సత్తయ్య, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.