Teacher’s Day Celebrations in Nirmal: అన్ని వృత్తుల కెల్లా ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ అన్నారు. గురువారం నిర్మల్‌లోని సోమవార్‌పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తుగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. చీకటిలాంటి అజ్ఞానాన్ని గురువు తొలగించి వెలుతురు లాంటి జ్ఞానాన్ని అందిస్తాడని అన్నారు. గురువు నేర్పిన విద్యాబోధనల వల్లనే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందని, దానికి ఉపాధ్యాయుడే మార్గదర్శకుడు అని అన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలతో నివాళులర్పించారు. ఆయన విద్యారంగానికి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థినులు ఉపాధ్యాయులను సన్మానించి పెన్నులను బహూకరించారు.
