Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 8 (మన బలగం): నిషేధిత మత్తుపదార్థాలను సంపూర్ణంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆమె మత్తు పదార్థాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సహా నిషేధిత మత్తుపదార్థాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువత మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. గంజాయిని సాగుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మత్తు పదార్థాలను వినియోగించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేసి మత్తు పదార్థాలను నియంత్రించాలని సూచించారు.
అంతర్రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్‌ల వద్ద నిరంతరం నిఘా నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం గురించి తెలిస్తే వెంటనే జిల్లా పోలీస్ నెంబర్ 8712671111కు తెలియజేయాలనీ, అలాగే టోల్ ఫ్రీ 1908 నంబరును సంప్రదించాలని, తద్వారా మత్తు పదార్థాలకు బారి నుంచి రక్షించవచ్చునన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని విముక్తి కేంద్రంలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యా, పోలీసు, ఎక్సైజ్ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలోని విద్యాసంస్థల్లో మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాల్లో గంజాయి సాగు చేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందజేయాలని ఆదేశించారు.
ప్రజలు సహకరించాలి.. ఎస్పీ జానకి షర్మిల
గంజాయి రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న తమకు సహకరించాలని తద్వారా మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు. మండలాల వారీగా ఇప్పటివరకు నమోదైన గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి వివరించారు. మత్తు పదార్థాలను వినియోగించిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతీ బుధవారం గ్రామాల్లో కళాకారుల ద్వారా మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్, డీఎస్పీ గంగారెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, ఎస్సీ అధికారి రాజేశ్వర్ గౌడ్, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.