Maulana Abul Kalam birth anniversary: నిర్మల్, నవంబర్ 8 (మన బలగం): స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136 జయంతి ఉత్సవాలను శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శేఖ్ సహాబ్ పేటలో కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ బిన్ అలీ, శేఖ్ ఇంతియాజ్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో పోషించిన కీలక భూమికను వివరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన త్యాగాలను, పోరాట పటిమను నవ సమాజానికి తెలిసేలా సొసైటీ ఆధ్వర్యంలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈనెల 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో స్మారక క్లాక్ టవర్ వద్ద నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సయ్యద్ అబ్రారుల్ హసన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు శకీల్ అహ్మద్, మొహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.