- హోమ ధూపం.. సర్వపాప హరం
- 15 రోజులుగా కొనసాగుతున్న చండీ హోమం
- దీప కాంతుల్లో వెలిగిపోతున్న హోమస్థలం
Deepotsavam: నిర్మల్, నవంబర్ 23 (మన బలగం): నిర్మల్ పట్టణం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. 15 రోజులుగా కొనసాగుతున్న శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర హోమంతో నిమ్మల పట్టణం భక్తితో నిండిపోయింది. ప్రతినిత్యం వేలాదిమంది వివిధ పూజల్లో పాల్గొంటున్నారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో దేవుడి కళ్యాణాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు నిత్య చండీ హోమం కొనసాగుతోంది. హోమంలో పాల్గొనకపోయినా దర్శనం చేసుకున్నా సకల పుణ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో నిర్మల్ పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
నిత్య అన్నదానం
శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర హోమ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వచ్చే ప్రజలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వేలాదిమంది భక్తులకు ఉదయం, సాయంకాలం అల్పాహారం, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు.
దీప కాంతులు
చండీ హోమ కార్యక్రమంలో భాగంగా శనివారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. గోమయంతో చేసిన దీపాలను అక్కడే విక్రయిస్తున్నారు. ప్రజలు కొనుగోలు చేసి వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దీప కాంతులలో హోమ స్థలం వెలిగిపోయింది. లక్ష శివలింగాలకు చుట్టూ దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.