Operation of coaching centers without permission: కరీంనగర్, నవంబర్ 23 (మన బలగం): జిల్లా కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ నిరుద్యోగులతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చేలగాటం ఆడుతున్నారని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయకార్యదర్శి బామండ్లపల్లి యుగంధర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ ఎటువంటి అనుమతులేకున్నా నగరంలో కోచింగ్ సెంటర్లను నెలకొల్పి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అంబేద్కర్ స్టేడియాన్ని అడ్డాగా చేసుకొని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారని తెలిపారు.
సరైన ఫ్యాకల్టీ, సౌకర్యాలు లేకుండా ఇరుకు గదుల్లో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-1, 2, 3, 4 కోచింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల కనుగుణంగా హాస్టల్ ఏర్పాటు చేసి డబ్బులే కాకుండా విద్యార్థుల సర్టిఫికెట్లను లాక్కొని వారి వద్ద పెట్టుకుంటున్నారని తెలిపారు. ఉద్యోగం వస్తే ఒక రేటు రాకపోతే మరో రేటు అంటూ నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారన్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ప్రైవేటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల దగ్గర డబ్బులు దండుకొని గాలికి వదిలేశారని ఆరోపించారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సురేందర్ అమరేందర్ రెడ్డి మహేశ్, అనిల్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.