Kadem Project: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌లతో కలిసి కడెం ప్రాజెక్టును ఆమె సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద నీటిని 10 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నిరంతరం నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు, రైతులు, పశువుల కాపరులు, చేపలు వేటకు వెళ్లేవారు వరద నీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్టు వద్ద పోలీసులు పటిష్ట భద్రతను కొనసాగించాలని, పర్యాటకులు ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వర్షాలు అధికంగా కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, వర్షాలతో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్పీ గంగారెడ్డి, ప్రాజెక్టు ఈ ఈ విఠల్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో అరుణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.