Whip Laxman: ఎండపెల్లి మండలంలోని రాజరాంపల్లి పాతగుడూర్ గ్రామాలకు మధ్య గల వంతెనను సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించి స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజరాంపల్లి పాతగూడూర్ గ్రామాల మధ్య గల పాత వంతెన మొత్తం మునిగిపోయిందని తెలిపారు. కొత్త వంతెన 90 శాతం పూర్తి అయినప్పటికీ విద్యుత్ వైర్ల వలన రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, దీని గురించి విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడామని తెలిపారు. కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరిలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోందని చెప్పారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా శిథిలావస్థలో ఉండి కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, వాగులు చెరువులకు నీరు చేరె అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు అన్ని వసతులు కల్పించాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదలతో గ్రామాల్లో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. వాటికి కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్, అధికారులు, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎవరికి ఎటువంటి సహాయం అవసరం ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఏళ్ల వేళలా సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.