- రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
- చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- భోజన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్
Khanapur MLA: వైద్యులు రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులలో తిరుగుతూ రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఇటీవల రోగికి కాలంచెల్లిన సెలైన్ పెట్టిన ఘటన దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వైద్యులకు సూచనలు చేశారు. రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.
భోజన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలోని మందుల గదికి వెళ్లి మాత్రలను, సెలైన్‌లను పరిశీలించారు. కాలం చెల్లిన మందులను గ్లోకోస్, ఇంజక్షన్లను ఆసుపత్రిలో ఉంచుకోవద్దని, డాక్టర్లు ఎప్పటికప్పుడు మందులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో కొరత గల యంత్రాల పరికరాల నివేదికలను తమకు అందిస్తే, వాటిని త్వరలో మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.