Jagityala District Collector Sathya prasad: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 13 (మన బలగం): మార్చి 10 నుంచి 12 రోజులపాటు జరిగే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాలులో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి పన్నెండు రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు కోసం ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎండ వేడిమి తగలకుండా, ఇబ్బందులు ఎదురుకాకుండా చలువ పందిళ్లను వేయించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల కోసం కేటాయించిన సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షణతో ప్రశాంతంగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ఈవో శ్రీనివాస్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
