- కుల గణనలో లేని 60 లక్షల మందికిపైగా ప్రజలు ఏమైనట్లు?
- ఇకనైనా చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలి
- మళ్లీ ఇంటింటికీ రీసర్వే చేపట్టాల్సిందే
- గ్రామసభల ఆమోదం పొందాల్సిందే
- బీసీ సామాజిక ఓటర్ల సంఖ్యను తగ్గించి చూపడం వెనుక కుట్ర
Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కుల గణన సర్వే అంతా తప్పుల తడక అని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘ఎన్నికల సంఘం లెక్కలు పరిశీలిస్తే, తెలంగాణలో 3 కోట్ల 35 లక్షలకుపైగా ఓటర్లున్నారు. అట్లాగే ఓటు హక్కు లేని వారి విషయానికొస్తే… ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా నమోదైంది. వీరుగాక పాఠశాలకు వెళ్లని వారు, 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలు మరో 30 లక్షలకుపైగా ఉంది. ఈ లెక్కన తెలంగాణ జనాభా 4 కోట్ల 30 లక్షలు దాటుతుంది. తెలంగాణలో ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3 కోట్ల 95 లక్షలు. కానీ కుల గణన సర్వేలో తెలంగాణ జనాభా 3 కోట్ల 70 లక్షలుగా కుదించడం పెద్ద బూటకం. ఇది ఉత్తుత్తి సర్వే మాత్రమే. బీసీ సామాజికవర్గంలోని వివిధ కులాలకు చెందిన జనాభాను కుల గణన పేరుతో ఉద్దేశపూర్వకంగానే తగ్గించే కుట్ర చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ ‘కుల గణన’ పేరుతో రీ సర్వే చేయాలి.
ఆధార్ కార్డులను లింక్ చేసి ఇంటింటికీ వెళ్లి రీ సర్వే నిర్వహించాలి. దీంతోపాటు సర్వే పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీల్లో, వార్డుల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలి. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతో తుది జాబితాను ప్రకటించాలి. ఆ జాబితా మొత్తాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అప్పుడు మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో కుల గణన జరిగినట్లుగా భావిస్తాం. అట్లాకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రచారం కోసం తూతూ మంత్రంగా సర్వే చేయడంవల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఇకనైనా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చినా, బీసీ సామాజిక కులాల జనాభాను తగ్గించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. కుల గణన విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్యే ఏకాభిప్రాయం కొరవడింది. అట్లాగే బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని సొంత పార్టీ వాళ్లే తప్పు పడుతుంటే చేసిన తప్పును సరిదిద్దుకోకుండా కేంద్రంపై నిందలు మోపి తప్పించుకోవాలకోవడం సిగ్గు చేటు.’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.