AISF dharna: కరీంనగర్, జనవరి 27 (మన బలగం): సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న యూజీసీ గైడ్‌లైన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామారపు వెంకటేశ్, మచ్చ రమేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా సమితి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారపు వెంకటేశ్, మచ్చ రమేశ్ మాట్లాడుతూ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని విఘాతం కలిగిస్తున్న యూజీసీ గైడ్‌లైన్స్‌ను వెంటనే వెనిక్కి తీసుకోవాలని, రాష్ట్ర యూనివర్సిటీల వీసీల నియామకాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని, రాజకీయాలకు అతీతంగా విద్యారంగానికి సంబంధించిన వారినే యూనివర్సిటీలకు వీసీలుగా నియమించాలని అన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వ్యక్తులను ప్రొఫెసర్‌లుగా నియమించడానికే యూజీసీ నూతన మార్గదర్శకాలు ఇచ్చారని, విద్యారంగంలో మత చాందసవాదం ప్రభావం చూపుతుందని, దీని వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న విశ్వ విద్యాలయాలు అశాంతికి నిలయాలుగా మారే ప్రమాదం ఉందని, యూనివర్సిటీలపై సంఘ్ పరివార్ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న యూజీసీని వెంటనే ప్రక్షాళన చేయాలని రమేశ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారాపు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు కనకం సాగర్, జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మచ్చ పవన్, కళ్యాణ్, బోయిని విష్ణువర్ధన్, ప్రనిష్, మహేశ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.