Three accused arrested in murder case: మెట్పల్లి (ఇబ్రహీంపట్నం), అక్టోబర్ 23 (మన బలగం): హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు, ఆయన తమ్ముళ్లకు కొన్ని సంవత్సరాలుగా భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. పలుమార్లు గొడవ పడి కేసులు పెట్టుకున్నారు. సాయిలు తమ్ముళ్లు చందు, చిన్నిలతోపాటు అదే గ్రామానికి చెందిన గొల్ల సోమయ్య కలిసి సాయిలు హత్యకు పతకం రచించారు. సాయిలు ఓబులాపూర్ శివారులోని బ్రిడ్జి వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గొర్రెలు మేపుతున్నాడు. దీన్ని గమనించిన సోమయ్య చందు, చిన్నులకు సమాచారం అందించాడు. బైకుపై వచ్చిన వారు తమ వెంట సంచీలో తల్వార్‌ను తీసుకొచ్చారు. సాయిలుతో గొడవ పడ్డారు. అంతటితో ఆగకుండా తమ వెంట తెచ్చుకున్న తల్వార్‌తో సాయిలు మెడపై వేటు వేశారు. మెడ తెగి తీవ్ర రక్తస్రావమైన సాయిలు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. అనంతరం నిందితులు ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. సాయిులు భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు బైకులు, హత్యకు ఉపయోగించిన తల్వార్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.