Minister Bandi Sanjay Kumar
Minister Bandi Sanjay Kumar

Minister Bandi Sanjay Kumar: తెలంగాణ కాషాయ దళపతికి మోడీ పట్టం

  • బండి సంజయ్ చేసిన పోరాటాలు అసామాన్యం
  • ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్‌పై అలుపెరగని పోరు
  • కేంద్ర మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు

Minister Bandi Sanjay Kumar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్‌ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా… ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్‌కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం. సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించడంపై కరీంనగర్ పార్లమెంటు ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజాసంగ్రామ యాత్రతో చైతన్యం
ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్‌పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో, బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగునా పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్‌కే దక్కుతుందనడంలో సందేహం లేదు. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం, నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీచార్జీలు, కేసులు, అరెస్టులను లెక్క చేయని చరిత్ర సంజయ్‌దే.

అన్నదాతలకు అండగా
రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా దీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్. రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు. నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్టు చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు.

పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి
317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్‌ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్‌ఎస్ పాలకులు కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి అరెస్టు చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు. అయినా వెరవని సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేసులకు వెరువక- వెనుకడగు వేయక
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్‌దే. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్‌లో చోటు దక్కడంతో కార్యకర్తలు భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు.

హిందూత్వమే శ్వాసగా
నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే… ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందూత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందూత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్ధాతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందూత్వ ఐకాన్’ గా మారారు.

ప్రత్యామ్యాయ శక్తిగా ఎదగడంలో కీలకం
2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కార్యకర్తల సంబురాలు
రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్‌కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంతృప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్‌కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా ఆ శాఖను సమర్థంవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *