Collector Abhilash Abhinav: నిర్మల్, జనవరి 4 (మన బలగం): నిర్మల్ ఉత్సవాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లతో కలిసి నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. స్టాళ్ళు, వేదిక, మరుగుదొడ్లు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన సంవత్సరంలో నూతనంగా నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేద్దామని అన్నారు. రేపటి నుంచి (ఆదివారం) ఈ నెల 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నిర్మల్ ఉత్సవాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎన్టీఆర్ స్టేడియంలో వేరువేరుగా ప్రవేశము, నిష్క్రమనం ఏర్పాట్లు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
షీ టీమ్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిర్మల్ ఉత్సవాలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించాలన్నారు. విద్యుత్, ఫైర్ సిబ్బంది నిరంతరం అప్రమంతంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. తాగునీరు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిరంతరం కార్యక్రమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిర్మల్ ఉత్సవాలు, ఐ లవ్ నిర్మల్ వంటి సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. శాఖల వారీగా అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించే ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, ఆర్డీవో రత్న కళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో పి.రామారావు ఆర్అండ్బీ ఈఈ అశోక్ కుమార్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.