- వివాహమై ఇద్దరు పిల్లలున్నా.. ఏక కాలంలో రెండు ప్రభుత్వ కొలువుల సాధన
Shrutakirti: మనబలగం, కరీంనగర్ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో కష్టంతో కూడిన పని. అలాంటిది ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించడం అంటే ఆషామాషి కాదు. నిర్విరామ కృషి, అకుంఠిత దీక్ష, ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు, జిల్లా బహుజన టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్) అధ్యక్షులు, బహుజన ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్న మానుపాటి రాజయ్య ఏకైక కుమార్తె శృత కీర్తి సక్సెస్ స్టోరీ. వివాహమైన తర్వాత కుటుంబ బాధ్యతలను మోస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మానుపాటి శృతకీర్తి సాధించిన విజయం ఇది.
ఇటు కుటుంబ బాధ్యతలు, ఇద్దరు పిల్లల పోషణ, పెంపకం వంటి బాధ్యతలు నిర్వహిస్తూనే, సమయం సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి స్కూల్ అసిస్టెంట్ గణితం, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అనే రెండు పోస్టులకు ఏకాకాలంలో ఎంపిక అవ్వడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. తన పట్టుదల, కార్యదీక్ష, సంకల్పము, సాధించి తీరాలన్న కసి, ఆకాంక్షల ముందు బాధ్యతలు చిన్నబోయి ఈ విజయాన్ని తను సాధించేలా చేశాయి. ప్రతి చిన్న విషయానికి, చదివేందుకు సమయం లేదు అని సాకులు చెబుతూ విజయానికి దూరమయ్యే ఎందరో వ్యక్తులకు శృతకీర్తి ప్రయాణం ఆదర్శనీయం. మనసులో కోరిక బలంగా ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించవచ్చునని శృతకీర్తి నిరూపించింది. సంవత్సరాల తరబడి చదివి ఒక ఉద్యోగాన్ని సాధించడమే గగనం అయిపోయిన ఈ రోజుల్లో శృతకీర్తి ఎన్నో అడ్డంకులను అధిగమించి రెండు ఉద్యోగాలను ఏకాకాలంలో సాధించడం అంటే మామూలు విషయం కాదు.
నిజంగా శృతకీర్తి అద్భుతమే చేసిందని చెప్పాలి. పేరుకు తగ్గట్టే ఈ విజయంతో తన ‘కీర్తి’ని పెంపొందించుకుంది. శృతకీర్తి విజయంలో తన తండ్రిగారైన (బహుజన ఏకలవ్య ఫౌండేషన్ ఫౌండర్) మానుపాటి రాజయ్య పాత్ర విస్మరించలేనిది. వారి పట్టుదల, వారి జ్ఞానము వారసత్వంగా తన కూతురికి అందించి ఈ విజయాన్ని సాధించి పెట్టారు. శృత కీర్తి భర్త బిజిలి శ్రీనివాస్ తనకు అన్ని వేళలా తోడుగా ఉండి విజయం సాధించిడంలో సహకారాన్ని అందించారు. ఈ విజయాన్ని సాధించిన శృతకీర్తిని జిల్లా ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ప్రముఖులు, గ్రామస్తులు అందరూ అభినందించారు.