- ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు పోలీస్
- పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
- నిర్మల్ ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల
Salute to the Immortal Police: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): ప్రజారక్షణలో పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో వారి కృషి ఎంతో ఉందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల వారోత్సవాల (Police Martyrs Week) ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్మారకార్థం కాగడాను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో, రాష్ట్ర భద్రతలో పోలీసు అంతే కీలకమని అన్నారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజావసరాల కోసం, ప్రజా సంరక్షణ కోసం ఏర్పడ్డదే పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా అన్ని సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
చైనా దురాక్రమణను తిప్పి కొట్టిన రోజు
అక్టోబర్ 21 ప్రాముఖ్యతను ఎస్పీ వివరిస్తూ 1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో కొంత మంది పోలీసులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుందాం… దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది… 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నదే అమరవీరుల దినోత్సవం. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలు అందేలా చూడడం, ఆయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అని ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
శ్రమతో కూడుకున్న ఉద్యోగం పోలీసు
పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం, అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని ఎస్పి అన్నారు.
అమరుల కుటుంబాలకు ఎస్పీ ఓదార్పు
ఈ సందర్భంగా త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరుల కుటుంబ సభ్యులు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను రోల్ ఆఫ్ హానర్ ను అదనపు ఎస్పీ సూర్యనారాయణ చదివారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సూర్యనారాయణ, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్.ఎస్ఐలు, డీపీఓ స్టాఫ్, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.