Kunkumarchana: నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి రోజూ మహా అన్నదానం నిర్వహిస్తున్నారు. మాలధారులతోపాటు కాలనీవాసులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రతి నిత్యం మహా అన్నదానం నిర్వహించడం ఇక్కడి ప్రత్యకత. మంగళవారం బోనాల కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటి బోనం తీసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ‘పిల్లాపాపలను చల్లగా చూడమ్మా’ అంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. బుధవారం కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. కుంకుమార్చనలో కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుంకుమార్చన కొనసాగింది. అనంతరం గంగిరెద్దుల విన్యాసాన్ని ప్రదర్శించారు. గంగిరెద్దు విన్యాసం ఆద్యంతం ఆకట్టుకుంది.