School inspection: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి పి.రామారావు సూచించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని సోమార్‌పేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వంటగదిని, వంట సామగ్రిని, వంట పాత్రలను పరిశీలించి సిబ్బందికి, ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వంట పాత్రలను శుభ్రంగా కడగాలని, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, నాణ్యమైన బ్రాండెడ్ వంట వస్తువులను, సామగ్రిని వాడాలని ఆదేశించారు. వంట చేసేవారు తప్పనిగా సరిగా టోపీ, గ్లౌజెస్, అఫ్రాన్ ధరించాలని సూచించారు. ప్రతిరోజూ ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో వస్తువుల నాణ్యతను పరిశీలించాలని, చేసిన వంటను సభ్యులు భోజనం చేసిన తదుపరి విద్యార్థులకు వడ్డించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో తరగతి గదిలో మాట్లాడుతూ జిల్లాను మూడోసారి మొదటి స్థానంలో నిలపడానికి విద్యార్థులు కష్టపడి చదవాలని, హ్యాట్రిక్ బ్యాచ్‌గా నిలవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్ఓలు లింబాద్రి, సలోమి కరుణ, నిర్మల్ పట్టణ ఎంఈఓ నాగేశ్వరరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్, ఉపాధ్యాయులు జాఫర్, మనోహర్ రెడ్డి, శ్వేత తదితరులున్నారు.