Nirmal Collector: నిర్మల్, జనవరి 18 (మన బలగం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. శనివారం కుంటాల మండలం లింబా (కే) గ్రామంలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను, సర్వే బృందాలు సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ శివారులోని ఆయా సర్వే నంబర్లలో గల రైతులకు సంబంధించిన పట్టా భూములను, అసైన్డ్ స్థలాలను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి, 21 నుంచి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు.
ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు కుంటాల మండల కేంద్రంలోని పశు వైద్య శాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ స్టో రూమ్ ని పరిశీలించి గడువు తీరిన మందులను వెంటనే తీసివేయాలని రికార్డులలో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం పౌర సేవా కేంద్రం, మండల గ్రంథాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డీఎస్‌వో కిరణ్ కుమార్, తహసీల్దార్ అజీజ్, తదితరులు ఉన్నారు.
