Family suicide attempt: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): అప్పుల బాధతో ఓ కుటుంబం నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని న్యాల్కల్ రోడ్డులో వేణు కుటుంబంతో నివాసముంటున్నాడు. వేణుకు భార్య అనురాధ, కూతురు పూర్ణిమ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని గంజ్‌లో ఉన్న ఇద్దరు వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చాలని వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడంతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బాసర గోదావరిలో ముగ్గరూ దూకారు. స్థానికులు గమనించి వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. అనురాధను ఒడ్డుకు చేర్చారు. వేణు, పూర్ణిమల కోసం గాలిస్తున్నారు. పోలీసులు వేణు మృతదేహాన్ని గజ ఈతగాల్ల సాయంతో బయటకు తీశారు. పూర్ణిమ కోసం గాలిస్తున్నారు. సీఐ మల్లేశ్ ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు అనురాధ తెలిపింది.