PRTU Telangana: మనబలగం, తెలంగాణ బ్యూరో: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా సంచాలకులు ఈ.వి. నర్సింహారెడ్డిలను పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ బుధవారం సచివాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులకు నూతన సర్వీసు రూల్స్ అమలయ్యే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ కోరారు. ఈ అంశంపై సమీక్షించి ప్రతిపాదనలు తయారు చేస్తామని విద్యా శాఖ కార్యదర్శి, సంచాలకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. 398 స్పెషల్ టీచర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. పరిశీలన చేసి వీలైనంత తొందరగా ఫైల్ ప్రిపేర్ చేసి పంపాలని వారి ముందే డిప్యూటీ సెక్రటరీ హరితకు చరవాణి ద్వారా ఆదేశించారు.
సమగ్ర శిక్ష సిబ్బందికి, కేజీబీవీ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించాలని, వారికి కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె మహిళా ఉద్యోగినులకు 27, పురుష ఉద్యోగులకు 22 సాధారణ సెలవులు, కేజీబీవీ పాఠశాలలలో కేర్ టేకర్లను మంజూరు చేయాలని హర్షవర్ధన్ రెడ్డి, సత్యనారాయణ కోరారు. మినిమమ్ టైం స్కేల్ అంశాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చిస్తామని, సాధారణ సెలవుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మోడల్ స్కూల్స్‌లలో హిందీ పీజీటీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు మంజూరు చేసినట్లయితే, మోడల్ స్కూల్స్ కూడా పరిపుష్టి అవుతాయని కోరగా, వచ్చే విద్యా సంవత్సరం నాటికి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అధికారులు హామీ ఇచ్చారు.
అక్టోబర్ 31 నాటికి ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను నింపాలని, పదోన్నతులకు ముందే ఇప్పటివరకు ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు బదిలీల కౌన్సిలింగ్ చేయాలని హర్షవర్ధన్ రెడ్డి, సత్యనారాయణ కోరగా కచ్చితంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్ అసంపూర్తిగా జరిగిందని, ఇంకా 503 మంది అప్‌గ్రేడేషన్ కాలేదని, వారిని సైతం అప్‌గ్రేడేషన్ చేస్తే 100% చేసినట్టు అవుతుందని సూచించారు. విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నందున, వారితో మరోసారి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. విద్యాశాఖ కార్యదర్శి బుధవారం అనేక కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, హర్షవర్ధన్ రెడ్డి తీసుకువెళ్లిన ప్రతి సమస్యను సావధానంగా విని వాటి పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మార్గం సులువు కానున్నది.