Nirmal Collector: నిర్మల్, జనవరి 20 (మన బలగం): నూతన ప్రభుత్వ పథకాల అమలుకు రేపటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, నూతన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా గ్రామసభల నిర్వహణకు ప్రత్యేకాధికారులను నియమించి, అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. పథకాల అమలుపై ప్రజలకు ఎటువంటి సందేహాలు ఉన్నా గ్రామ సభల్లో అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గ్రామ, వార్డు సభలలో వివిధ పథకాలకు దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందిచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.