- విశ్వవిద్యాలయంపై విశ్వసనీయత ఎంత?
- ఉన్నత విద్య అందని ద్రాక్షేనా?
- ఆకాంక్ష నెరవేరే తరుణమిదే
- ‘సాధన సమితి’ సంకల్పం
- నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీ కోసం ఏకతాటిపైకి
Nirmal University Demand: ఓ విద్యార్థి..! నిన్నే..!! ఇకనైనా మేలుకో..!!! వేచి చూస్తే కాలం కరిగిపోతుందే తప్ప అనుకున్నది సాధించలేవు. హక్కు కోసం ఉక్కు పిడికిలిగా మారాల్సిన సమయం వచ్చేసింది. నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీ(University) సాధనలో చేయి కలుపు. వలస చదువులకు విముక్తి పలకాలంటే జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు అత్యావశ్యకం. యూనివర్సిటీ సాధనతో సామాజిక న్యాయం(Social justice), సమానవత్వానికి (Equality) బాటలు పడతాయి. వర్సిటీ ఏర్పాటు నిర్మల్ జిల్లా(Nirmal District)లోని ప్రతి గుండెచప్పుడు. దశాబ్దాల కలను సాకారం చేసేందుకు విద్యార్థి(student), ఉపాధ్యాయ (teacher), మేధావి, వివిధ రంగాల వారితో యూనివర్సిటీ సాధన సమితి ఏర్పాటైంది. వర్సిటీ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సమితి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తోంది.
చదువులతల్లి కొలువైన జిల్లా
తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష సాకారమై దశాబ్దం దాటింది. అయినా నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన యూనివర్సిటీ ఏర్పాటు అంశం ఎండమావిగానే మారింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిర్మల్ జిల్లా చారిత్రాత్మకంగా, సామాజికంగా, రాజకీయంగా విశేష ప్రగతి సాధించింది. కానీ విద్యారంగంలో ఎంతో వెనుకబడి ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక జ్ఞాన సరస్వతీ మాత ఆలయం ( Saraswati Mata Temple) నిర్మల్ జిల్లాలోనే ఉండడం ఎంతో గర్వకారణం. చదువుల తల్లి కొలువై ఉన్న జిల్లాలోనే విశ్వవిద్యాలయం లేకపోవడం శోచనీయం.
వలస చదువులు
జిల్లాలో అధికశాతం వెనుకబడిన తరగతుల వారు, గిరిజనులు, దళితులు ఉన్నారు. పేద రైతుల పిల్లలు ఉన్నారు. జిల్లాలో ఉన్నత విద్యావకాశాలు లేక జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ (Hyderabad), నిజామాబాద్ (Nizamabad), వరంగల్ (Warangal), మహారాష్ట్ర (Maharashtra), ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక చదువుకు పుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. యూనివర్సిటీ చదువులు ఆర్థిక భారంతో కూడుకున్నవి కావడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తమ ‘ఉన్నత’ ఆశలు చంపుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఆర్థికభారాన్ని మీదేసుకొని తమ పిల్లలను పైచదువులకు దూరప్రాంతాలకు తోలేస్తున్నారు. అక్కడికి వెళ్లిన విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అద్దె ఇళ్లలో ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాల్సిన దురావస్థను ఎదుర్కొంటున్నారు.
వెలకట్టలేని సాంస్కృతిక సంపద
నిర్మల్ జిల్లా పచ్చని అడవులు, ప్రకృతి రమణీయతో విలసిల్లుతోంది. సాంస్కృతికపరంగా ఎన్నో విశిష్టతలను కలిగిన ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొయ్యబొమ్మలు, గిరిజన సాంస్కృతితో పరిఢవిల్లుతున్నది. ఎత్తైన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ర్టను కలుపుతూ హైదరాబాద్ మీదుగా జాతీయ రహదారితో మెరుగైన రవాణా సౌకర్యం ఉన్నది.
హామీలతో సరి
ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ విశ్వవిద్యాలయ అంశాన్ని ప్రస్తావించి ఓట్లు దండుకోవడమే తప్ప హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరిస్తున్నారు. అనేక ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు విద్యార్థుల ఉన్నత విద్య ఆకాంక్ష అయిన యూనివర్సిటీపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయి. జిల్లా ప్రజల భావోద్వేగాలను అణచడమేకాకుండా నిర్లిప్త వైఖరి స్పష్టమువుతోంది. జిల్లాకు చెందిన రాజకీయ నేతలు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల్లో మంత్రులుగా కొనసాగినా జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయారు.
ప్రయోజనాలు అనేకం
యూనివర్సిటీ స్థాపనతో ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా విద్యార్థులు దూర ప్రాంతాలకు వలస వెళ్లే దీనావస్థ తప్పుతుంది. చెంతనే ఉన్నత విద్యా అవకాశాలు ఉండనున్నాయి. స్థానిక స్థాయిలోనే డిగ్రీ, పీజీ, పరిశోధనావకాశాలు మెరుగుపడనున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది, పరిశోధకులతోపాటు అనుబంధ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీంతో నిరుద్యోగ సమస్య కొంత వరకు తీరుతుంది. జిల్లాలో అటవీ సంపద, ఔషధ మొక్కలు, జలవనరులు, గిరిజన సంస్కృతులపై అధ్యయనాలకు అవకాశాలు ఏర్పడతాయి.
ప్రభుత్వం స్పందించాలి
తెలంగాణ ప్రభుత్వం గతంలో వర్సిటీలు ప్రారంభించినా నిర్మల్ జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉత్తర తెలంగాణ విద్యార్థుల ఆశలపై నీళ్లుచల్లినట్లైంది. రాష్ర్ట ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను గుర్తించి, ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని విద్యాధికులు కోరుతున్నారు. అన్ని ప్రాంతాల వారికి విద్యను సమానంగా అందించడం ప్రభుత్వ బాధ్యత. విద్యావనరుల విస్తరణ సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వానికి దోహదపడుతుంది.
పోరాటమే శరణ్యం
హక్కుల సాధనకు పోరాట బాట పట్టాల్సిందే. యూనివర్సిటీ స్థాపన కేవలం విద్యార్థుల సమస్య కాదు.. సామాజిక న్యాయ సమస్య. విద్యార్థి సంఘాలు ఉద్యమించాల్సిన సమయం ఇదే. మేధావులు, ఉపాధ్యాయులు కదిలిరావాలి. ప్రతి ఊరు, పట్టణం యూనివర్సిటీ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. యూనివర్సిటీ సాధన సమితి సారథ్యంలో ఉద్యమిస్తే విజయం తథ్యం. తెలంగాణ సాధించుకున్న మనకు యూనివర్సిటీ సాధన ఓ లెక్కా..?
-గజనాథం శ్రీనివాసాచారి (9440565303)