CM to Vemulawada on 20th: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20 న వేములవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, జౌలి శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, టూరిజం శాఖ ఎండి హనుమంతు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం పట్టణంలోని గుడి చెరువు ఆవరణలో సభా స్థలిని పరిశీలించారు. హెలిపాడ్, సభ ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లును పర్యవేక్షించారు. జిల్లా సమగ్ర అభివృద్దే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎం.ఎల్.ఏ. ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు రానున్నారని తెలిపారు. నూలు డిపో ఏర్పాటు నేతన్నల చిరకాల కోరిక అని, సీఎం రాకతో నేతన్నల 30ఏండ్ల కల నెరవేరనుందని చెప్పారు. శృంగేరి పీఠం వారి ఆదేశాల మేరకు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాజన్న భక్తులకు సులువుగా శీఘ్రమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
ఆనాడు పి.సి.సి అధ్యక్షుడి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి నేడు సీఎం హోదాలో ఆలయానికి వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకుంటారని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం, యార్న్ డిపోతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని వివరించారు. సీఎం పర్యటనతో ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ప్రాజెక్టు పనులతో పాటు శ్రీపాద ప్రాజెక్టు పనులకు అడుగులు పడనున్నాయన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి సభా వేదిక, హెలిప్యాడ్ వంటి ఏర్పాట్లను పరిశీలించామని, పర్యటనకు సంబంధించి అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాజన్న ఆలయ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం, ఈవో వినోద్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.