- లేదంటే 10 వేల మందితో భారీ ధర్నా
ఆయిల్ పామ్ ప్రతీ గింజకొనే బాధ్యత ప్రభుత్వానిదే
BJP leader Yeleti Maheshwar Reddy: నిర్మల్, మార్చి 10 (మన బలగం): మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వయసు మీదపడడంతో మతిభ్రమించి మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇష్టా రీతిన అక్రమాలు, భూ కబ్జాలు, చేసి జిల్లాను అస్తవ్యస్తంగా చేసారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పామ్ ఆయిల్ కంపెనీకి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది వాస్తవం కాదా, సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇచ్చినపుడు నిర్మల్‌లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి పాక్‌పట్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీకి తక్కువ ధరకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కొరకు భూములు ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కేవలం కమిషన్లకు ఆశపడి భూములను అప్పనంగా అప్పగించారని విమర్శించారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇచ్చే కమిషన్లతో రైతులతో కలిసి ధర్నా చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. 100 గజాలు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడానికి చేతకాదు కానీ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడానికి చేతులు వచ్చాయని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై నిర్వహించిన జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం కేటాయించిన భూమి ఇరిగేషన్ శాఖ పరిధిలోనిదని, ఆ ప్రాంత ముంపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు ఒక సర్వే నెంబర్‌లో చూపి, నిర్మాణం వేరే సర్వే నెంబర్లో చూయించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని, ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నా చేయాలని ఎద్దెవా చేశారు. నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రికి రిటైర్మెంట్ ప్రకటించి గత ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు.
ఓటమి చెంది నెల రోజులు కాక ముందే అధికార పార్టీలో చేరింది అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి కాదా, నీ సొంత తమ్ముళ్లు చేసిన అక్రమాలు అంతాఇంతా కాదు, ఇరిగేషన్ నాళాలు పూడ్చి అనుమతులు లేకుండా లెఔట్‌లు చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రత్నాపూర్ కాండ్లిలో గ్రో-ఫాస్ట్ పేరిట మీ కుటుంబ సభ్యుడు ఇరిగేషన్ కెనాల్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, పూడ్చేసి అక్రమ లేఔట్ నిర్మించారని ఆరోపించారు. మీ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, నాయకులు ముత్యం రెడ్డి, భూపాల్ రెడ్డి, సాదం అరవింద్, భూపతి రెడ్డి, వొడిసేల అర్జున్, మండల పార్టీ అధ్యక్షులు మార గంగారెడ్డి, బర్కుంట నరేందర్, నర్సరెడ్డి, నాయకులు విజయ్, రాజేందర్, దత్తూరాం తదితరులు పాల్గొన్నారు.