సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్
Midde Ramulu: కరీంనగర్, జనవరి 7 (మన బలగం): కరీంనగర్ కళాభారతికి మిద్దె రాములు పేరు పెట్టాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కరీంనగర్ జిల్లా వేములవాడ ప్రాంతంలో జన్మించి తన ఒగ్గు కథలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీసీ గౌడ కులానికి చెందిన మిద్దె రాములు పేరు పెట్టడం ద్వారా నేటి యువతరానికి ఆయన సేవలు తెలిపిన వారం అవుతామని ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దె రాములు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి తన ఒగ్గు కథను చెప్పినటువంటి చరిత్ర ఆయనకు ఉందన్నారు. మిద్దె రాములు ఒగ్గు కథ బోనం ప్రదర్శన ఆనాటి విద్యార్థుల్లో ఒక ప్రభంజనం సృష్టించిందని పేర్కొన్నారు. ఆయన కథా ప్రభావం ఎంతలా ఉండేదంటే కథ విన్న రెండు రోజుల దాకా గ్రామాల్లోని స్త్రీలు, వృద్ధులు ఆ యొక్క కథలోనే మమేకమై కథలోని పాత్రలో వారు పడ్డ కష్టాలను గుర్తుచేసుకునేవారని తెలిపారు. మిద్దె రాములు కథ వినడం కోసం పక్క గ్రామాల నుంచి వచ్చి రాత్రంతా ఉండి కథ వినివెళ్లే వారని అన్నారు. కథల ద్వారా ఎంతోమంది ప్రజలను చైతన్యపరిచి తన కళలు ప్రజలకు అందించిన చరిత్ర ఆయనదని పేర్కొన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని, ఎన్నడూ కూడా తన కోసం ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచన లేని వ్యక్తి అని కొనియాడారు. ఆయన లాంటి వ్యక్తి మనం చూడలేమని, సమాజంలో ఎంతోమందికి ప్రేరణగా ఉన్న ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మిద్దె రాములు పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబులు కళాభారతికి మిద్దె రాములు పేరు పెట్టేందుకు కృషి చేయాలని కోరారు.