- సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సిందే
- తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
- లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం
- మన్మోహన్ సింగ్‌ను రబ్బర్ స్టాంప్‌గా మార్చింది కాంగ్రెస్ కాదా?
- మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా?
- పీవీని అడుగడుగునా అవమానించిన మీకు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేనేలేదు
- దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం
Bandi Sanjay: మనబలగం, కరీంనగర్ బ్యూరో: వచ్చే సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. అట్లాగే ఇచ్చిన మాట మేరకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్‌లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు రాగుల నగేశ్ (జూనియర్ లెక్చరర్), అమర్ నాథ్ యాదవ్ (స్కూల్ అసిస్టెంట్), రాజశేఖర్, వెంకటేశ్ (సీఆర్పీఎఫ్), కార్తీక్, ప్రియాంక (గ్రూప్ 4) మాట్లాడుతూ ‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మాతోసహా ప్రతి పేదవాడి కల. డబ్బుల్లేక కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఆగిపోయినం.
ఈ సమయంలో బండి సంజయ్ మా కోసం ముందుకొచ్చి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉచిత భోజన, వసతి కల్పించారు. వేలాది రూపాయల వ్యయమయ్యే కోచింగ్‌ను ఉచితంగా అందించారు. బండి సంజయ్ వల్ల ఈరోజు ఉద్యోగం సాధించాం. బండి సంజయ్ కుమార్‌కు మేం రుణపడి ఉంటాం. పేదలకు మీరు చేస్తున్న మేలును ఎన్నటికీ మరువలేం’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఈరోజు ఉద్యోగాలు సాధించారు, సంతోషంగా ఉంది. అయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి 4 ఏళ్లయినా వాటిని భర్తీ చేయలే. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది. 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరం.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్‌లో ప్రకటించింది. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. అభ్యర్థులకు అపాయిట్‌మెంట్ లెటర్లు ఇచ్చింది. కానీ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని మాట తప్పింది. ఒక్కో నిరుద్యోగికి రూ.48 వేలు బకాయి పడింది. వెంటనే ఆ బకాయి ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళనలు చేపడుతాం. దీంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నరు. యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి. విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నరు. అందుకే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. సంక్రాంతిలోపు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును చెల్లించాల్సిందే. లేనిపక్షంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచి తీరుతాం.
ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఇది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఆ మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్దమైంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ ఆయనను రబ్బర్ స్టాంప్‌గా మార్చింది. అట్లాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్‌ను దారుణంగా అవమానించారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు సిద్దమైంది. కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్. వారికి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేనేలేదు.’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.