Science Fair: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాస్థాయి ఇన్‌స్పయిర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం 10:30కు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లాస్థాయి ఇన్‌స్పయిర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు 68 ఇన్‌స్పయిర్ ప్రాజెక్టులు, 400కు పైగా నమూనా ప్రదర్శనలు ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల నుంచి దాదాపు 800లకు పైగా విద్యార్థులు, 250 మందికి పైగా టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యంత తెలివైన అద్భుతమైన ప్రాజెక్టులను తీసుకురావడం అభినందనీయం అన్నారు. గతంలోనూ ఇలాంటి ప్రదర్శనల నుంచే రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రదర్శనలను రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. జిల్లా విద్యాశాఖ కోరిక మేరకు సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 400కు పైగా నమూనా ప్రాజెక్టులు తీసుకురావడం ఇన్‌స్పయిర్‌లో 68 ప్రాజెక్టులు తీసుకురావడంలో విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం అభినందనీయమని ఉపాధ్యాయులను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితో మొదటి రోజు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. శనివారం ఈ ప్రదర్శన కొనసాగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు ఈ ప్రదర్శనను శనివారం మధ్యాహ్నం లోపు వీక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ బింగి మహేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, డైరెక్టర్ దైత కుమార్, ఖమ్మం గణేష్, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు అన్నారం శ్రీనివాస్, పులి రాంబాబు, సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, కొక్కుల రాజు, అన్ని మండలాల విద్యాధికారులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.