Aadi Srinivas
Aadi Srinivas

Aadi Srinivas: త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూలు డిపో ఏర్పాటు

  • నేతన్న కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు

Aadi Srinivas: మనబలగం, సిరిసిల్ల: త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్‌లో నేత కార్మికుడు ఎర్రం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇబ్బందులు తాళ లేక నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోనే గణేశ్ నగర్‌కు చెందిన ఎర్రం కొమురయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం నేరుగా నేతన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొమురయ్య మరణం చాలా బాధ కలిగించిందని, సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని అన్నారు. కొమురయ్య భార్య దివ్యాంగురాలని, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద రెండు లక్షల రూపాయలను కుటుంబానికి అందించామన్నారు. ఈ సంఘటన గురించి తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి కుటుంబానికి సహాయం అందేలా చేసామని వెల్లడించారు. నేత కార్మికులు ఎవరు ఒత్తిడికి గురికాకుండా కుటుంబ సభ్యులను చూసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కావద్దని కోరారు. ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. నేత కార్మికులు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజులలో నేత కార్మికులకు మెరుగైన రీతిలో ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు.

రైతన్నలు, నేతన్నలు, నిరుద్యోగ యువత, మహిళలు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రెండు రోజుల క్రితం భార్యా భర్తలు మరణించిన ఘటన కూడా చాలా బాధ కలిగించిందని, ఆ కుటుంబంలోని పిల్లలకు ఉన్నత చదువులు చదివినందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఆసాములు, నేత కార్మికులకు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, వేములవాడ క్లస్టర్ జోన్లు త్వరలోనే నూలు డిపో 50 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని అన్నారు. నూలు డిపో ద్వారా 80 శాతం క్రెడిట్ ద్వారా ఆసాములకు అందించి తయారుచేసిన బట్టను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రణాళిక తయారు చేశామని అన్నారు. చేనేత క్లస్టర్‌గా ఉన్న మన జిల్లాలో నూలు యార్డు రావడం మనకు బాగా ఉపయోగపడుతుందని వివరించారు. బ్యాంకు ద్వారా చేనేత సంఘాలకు అవసరమైన రుణాలు కూడా అందిస్తామని అన్నారు. నేత కార్మికులకు శాశ్వతంగా మంచి ఉపాధి చూపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల తహశీల్దార్ ఎం.ఉమారాణి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ ఏడీ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *