- రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు
- ప్రజాపాలన కాదు 15% కమీషన్ పాలన!
- కోట్లాది రూపాయలు వెచ్చించి అసత్య ప్రచారం
- ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది
- అయినా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసే కుట్ర
- కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై కన్నేశారు
- కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి
- నాగ్‌పూర్‌లో మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి పనిలోనూ, కాంట్రాక్టుల్లోనూ 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అయినప్పటికీ అన్ని హామీలు అమలు చేస్తున్నట్లుగా మహారాష్ర్ట్ర ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తూ మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇవ్వలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించినప్పటికీ, తెలంగాణలో రుణమాఫీ అమలు చేసినట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సొమ్మును ఖర్చు చేస్తూ తెలంగాణను మరింత దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ మైనారిటీ రిజర్వేషన్ల అమలు పేరుతో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్నాటక బీజేపీ ప్రతిపక్ష నేత నారాయణస్వామి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ బిందాల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డిలతో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం నాగపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి (మహారాష్ట్ర)కు వచ్చి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పడం అవాస్తవం. తెలంగాణ సొమ్మును వెచ్చించి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. కానీ ఆ యాడ్స్‌లో ఆరు గ్యారంటీల ఊసే లేదు. తప్పుడు హామీలతో ఇక్కడ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే వాస్తవాలు చెప్పేందుకే మీ ముందుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయనేలేదు. మేనిఫెస్టోలో పొందుపర్చిన 420 హామీల్లోనూ ఒక్కటీ అమలు చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ సర్కార్. తెలంగాణలో ప్రతి మహిళకు ఒక తులం (10 గ్రాములు) బంగారం, ఒక స్కూటీ, నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఒక్కరికి ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. వృద్ధాప్య పింఛన్‌ను నెలనెలా రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. పేదలకు ఇండ్ల జాగాతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలిస్తామని మోసం చేశారు. తెలంగాణలో రైతులను నిండా ముంచారు. రైతులు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలిస్తామని హామీ ఇచ్చారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ సంగతి దేవుడెరుగు.. కనీస మద్దతు ధర లభించకుండా చేస్తున్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ ఇవ్వలేదు. పీఆర్సీ అమలు చేయలేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతం పెంచుతామని బీసీ వర్గాలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ తొలుత హిమాచల్ ప్రదేశ్‌లో 10 గ్యారంటీలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కర్ణాటకలో పాంచ్ న్యాయ్ పేరుతో, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారు.
హర్యానాలోనూ ఇట్లాంటి హామీలతో అధికారంలోకి రావాలని భావిస్తే.. ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పి కొట్టారు. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలోనూ మహిళలకు రూ.3 వేలు, నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. కుల గణన వాగ్దానం చేస్తూ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను విశ్వసించరు. తెలంగాణలో కుల జనగణన పేరుతో ఆస్తిపాస్తుల వివరాలు సేకరించాలని చూస్తంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుల గణన సంగతి తరువాత ముందుగా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే నిండా అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో రూ.1.5 లక్షల కోట్లను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదు. ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. తెలంగాణలో 15 శాతం కమీషన్ల పాలన నడుస్తోంది. ఏ పని కావాలన్నా, ప్రాజెక్టు కావాలన్నా 15 శాతం కమీషన్ తీసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి పనిచేస్తూ ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై వివక్ష చూపుతోంది. తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. గత పది నెలల్లోనే దాదాపు 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇదే ఫార్ములాను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. కులం, మతం ఆధారంగా చీల్చి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసింది. అయినప్పటికీ ఇదే హామీని మహారాష్ట్ర ప్రజలకు ఇస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తోంది. ఈరోజు పత్రికలో చదివాను.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం పనులు ముస్లింలకు ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించింది. ఇది దుర్మార్గమైన చర్య. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం మాత్రమే కాదు. దేశానికి నడిబొడ్డుగానూ నిలిచింది. భక్తి ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటం, ఇంకా ప్రతి రంగంలో దేశానికి నాయకత్వం వహించింది. మొగల్స్ కోటను బద్దలు కట్టిన చరిత్ర మహారాష్ట్రది. ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ కు మద్దతిస్తారా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదని కోరుతున్నా. మహారాష్ట్రను అభివృద్ధిలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలకు సేవ చేయడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.’ అని తెలిపారు.