- విస్తుపోవడమే దక్కిందంట..!
- హోటల్ యజమానితో గొడవ
- చెత్తలోకి చేరిన ఇడ్లీలు
Cockroach in Idli: జగిత్యాల, అక్టోబర్ 31 (మన బలగం): పండుగ పూట ప్రశాంతంగా టిఫిన్ చేద్దామని ఓ వినియోగదారుడు కొత్త బస్టాండ్ సమీపంలోనీ ఓ హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేసాడు. తినేందుకు పూనుకోగా అందులో బొద్దింక కనబడి కస్టమర్ విస్తుపోయిన సంఘటన ఇది. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు టిఫిన్ సెంటర్‌కు గురువారం ఉదయం ఓ వినియోగదారుడు టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. ఓ ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. తీరా తినేందుకు ఇడ్లీని చుంచితే అందులో బొద్దింక లాగా కనిపించడంతో ఆ వినియోగదారుడు విస్తుపోయాడు. తేరుకొని హోటల్ యజమానితో ఆ కస్టమర్ గొడవకు దిగాడు. చూడకుండా తాను తిని అనారోగ్యం పాలైతే బాధ్యులు ఎవరు అంటూ హోటల్ యజమానిని నిలదీశాడు. మొదట బుకయించే ప్రయత్నం చేసిన ఆ హోటల్ యజమానిపై అక్కడి మిగతా కస్టమర్లు తిరగబడడంతో తప్పును ఒప్పుకోక తప్పలేదు. వెంటనే మిగతా ఇడ్లీలను చెత్తలో పారెయ్యాలని తన సిబ్బందికి పురమాయించాడు. అప్పటికే బొద్దింక ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితులు చేజారుతున్నాయని గ్రహించిన హోటల్ యజమాని మూసేసి ఇంటిదారి పట్టాడు.
పాత జెర్రీని మరువకముందే
కొద్దిరోజుల క్రితం స్థానిక తహసీల్దార్ చౌరస్తాలోని ఒక ఊడిపి హోటల్లో ఇలాగే ఓ కస్టమర్‌కు ఇడ్లీలో జెర్రీ కనిపించి ఆందోళనకు దిగగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్‌చేసి ఆపై ఫైన్ వేసిన సంఘటన ఇంకా ప్రజల్లోనే ఉంది. ఇది మరువక ముందే మరో హోటల్‌లో ఇడ్లీలో బొద్దింక రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై ప్రజలు నిప్పులు చేరుగుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకనే హోటల్ యజమానులు వినియోగదారులపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నదానికి ఇవే నిదర్శనాలని ప్రజలు అంటున్నారు.