Double bedroom houses: నిర్మల్, డిసెంబర్ 17 (మన బలగం): డబుల్ బెడ్రూం ఇండ్ల సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలపై తహసీల్దార్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పరిపాలన అనుమతులు పొందినవి, పూర్తి అయినవి, ఇంకనూ నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిపై సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. అలాగే ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో విద్యుత్తు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా మంజూరై చేపట్టిన ఇండ్ల పురోగతిపై కలెక్టర్ చర్చించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డిఓ రత్న కళ్యాణి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.