Prevention of electrical accidents
Prevention of electrical accidents

Prevention of electrical accidents: విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేయండి

జగిత్యాల ఎస్ఈ శాలియా నాయక్

Prevention of electrical accidents: గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతీ విద్యుత్ ఉద్యోగి నిత్యం విస్తృత ప్రచారం కల్పించాలని, తద్వారా మనుషులు, మూగజీవాల ప్రాణాలను రక్షించాలని జగిత్యాల జిల్లా ఎస్ఈ శాలియా నాయక్ కోరారు. గురువారం జరిగిన మెట్‌పల్లి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాను ‘జీరో యాక్సిడెంట్’ జిల్లాగా నిలబెట్టడానికి క్షేత్రస్థాయిలో విద్యుత్ నెట్వర్క్‌ను పటిష్టం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇంజనీర్లు స్థానికంగా ఉన్న కళాశాలలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల గురించి వివరించి, మళ్లీ అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి ఇళ్ళల్లో, ఊర్లల్లో తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించుటకు కృషి చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ ధరించి, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ వేసుకొని పనికి ఉపక్రమించాలన్నారు.

తాను పని చేయవలసిన ఫీడర్‌పై సరియైన లైన్ క్లియర్ తీసుకోవాలని, రెండు ఫీడర్ల క్రాసింగ్‌లు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. తోటి ఉద్యోగులతో సమన్వయంతో పని చేయాలన్నారు. రైతులు వ్యవసాయ పంపు సెట్లకు ఫైబర్ బాక్స్‌లు అమర్చుకోవాలని, ఇంటి ఆవరణలో బట్టలు ఆరవేయడానికి దండెము కొరకు జీఐ వైరు వాడవద్దు అని సూచించారు. తడిబట్టలకు ఇన్సులేషన్ పాడైపోయిన వైరింగ్ తగిలితే షాక్ వల్ల మరణం సంభవిస్తుంది. ఎవరైనా షాక్ గురైతే రక్షించాలన్న ఆత్రుతతో తాకరాదు, ఏదైనా కర్ర సహాయంతో విడదీయాలని తెలిపారు. రైతులు తమ పంటలను అడవి పందుల బారి నుండి రక్షణ కొరకు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే నేరము, చేపల వేటకు కరెంటు వాడవద్దు. ఒకవేళ అలాంటి పనికి పాల్పడితే సంఘటనలు క్రిమినల్ చర్యలు చేపడతారు. మనుషులు, మూగ జీవాల ప్రాణాలు చాలా విలువైనవి, కరెంట్ పట్ల అప్రమత్తత అవసరం అని తెలిపారు. సమావేశంలో డీఈ తిరుపతి, ఏడీఈలు మనోహర్, శ్రీనివాసరావు, అంజన్ రావు, రఘుపతి, ఏఈ లు, ఏఏఓ లు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *