- మున్సిపల్ ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
- సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
Sunil Rao Corruption: కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు (Sunil Rao) అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులతో విచారణ (ACB Investigation) జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ ( CPI) కరీంనగర్ నగర కార్యవర్గ సమావేశం సోమవారం న్యాలపట్ల రాజు అధ్యక్షతన బద్దంఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగర మాజీ మేయర్ సునీల్ రావు పదవీకాలంలో స్మార్ట్ సిటీ (Smart City Karimnagar) పనుల్లో పూర్తిగా అవినీతి రాజ్యమేలిందని కోట్ల రూపాయలు నీటిపాలు అయ్యాయని ఆరోపించారు. సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ(BRS)లో ఉన్నంతకాలం అవినీతిపై నోరు మెదపలేదని, బీజేపీ(BJP)లో చేరి అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సునీల్ రావు హయాంలో జరిగిన ప్రతి పనిలోనూ పర్సెంటేజీల రాజ్యం నడిచిందని, చిన్న చిన్న పనులకు కోట్ల రూపాయల బిల్లులు దొబ్బారని, జంక్షన్లలో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, టాయిలెట్ల నిర్మాణం, పార్కుల సుందరీకరణ, ఫుట్ పాతుల, సైడ్ ట్రాక్స్, మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణం తదితర పనుల్లో నాణ్యత కొరవడి పూర్తిగా అవినీతి జరిగిందని తెలిపారు. సునీల్ రావు నువ్వు ఏం పని చేస్తున్నావని నీకు కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయో ప్రజలకు వివరించాలని ఏమి పని చేయని నువ్వు కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవంతులు ఎలా నిర్మించావో ప్రజలకు వివరించాలన్నారు. దమ్ముంటేనీవు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన ఎన్నికల అఫీడవిట్‌ను ఆస్తుల వివరాలను ప్రజల ముందు పెట్టినిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల(Municipal Elections)కు సీపీఐ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ జెండాను కార్పొరేషన్‌పై ఎగరేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఇందిరమ్మ కమిటీలు వెయ్యకపోవడం వారి ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అన్నారు. వెంటనే నగరంలో అర్హులైన ప్రజలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు చేస్తామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టి అంజలి నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్తయ్య, కసి బోసుల సంతోష్ చారి, నునావతు శ్రీనివాస్, నగు నూరి రమేశ్, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.