Guru Puja Festival: నిర్మల్, జూన్ 6 (మన బలగం): దేశభక్తిని పెంపొందించి దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసేదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అని తెలంగాణ ప్రాంత కార్యవాహ ఉప్పలంచి మల్లికార్జున్ అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు, యుద్ధ సమయాల్లో తమ ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు సంఘ కార్యకర్తలని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ సంఘం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం పలు ఎత్తుగడలతో సంఘంపై నిషేధం విధించినప్పటికీ చట్టపరంగా పోరాడి ముందుకు సాగిన ఘనత స్వయం సేవక్ సంఘానికి ఉందన్నారు. చైనాతో యుద్ధం సమయంలో సైన్యానికి మద్దతుగా నిలిచి పలువురు సంఘ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారన్నారు.
దేశం ఎదుర్కొన్న అన్ని విపత్కర సమయాల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన సంఘ సభ్యుల త్యాగాలు నేటికీ ఆదర్శంగా నిలిచాయని అన్నారు. గోల్వాల్కర్ స్థాపించిన సంఘం శతాబ్ద కాలంగా దేశ సమగ్రత కోసం, దేశ రక్షణ కోసం సేవాభావంతో ముందుకు సాగుతోందని అన్నారు. దేశ యువత పరాయి వ్యవహారాల వ్యామోహంలో పడకుండా దేశ సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాల్సి ఆ బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది చిన్నోళ్ల నరేశ్ రెడ్డి, నూకల విజయ్ కుమార్, నగర సంఘ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.