Visit the nursery: నిర్మల్, ఫిబ్రవరి 8 (మన బలగం): వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం నాటికి నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం దిలావార్‌పూర్ మండలంలోని న్యూ లోలం గ్రామంలో పర్యటించారు. మొదట గ్రామంలో గల నర్సరీని సందర్శించి నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సంవత్సరం వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవం నాటికి మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు మొక్కలకు నీరును, పోషకాలను అందిస్తూ, మొక్కల ఎదుగుదలను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యంగా ఉన్నాయని నిర్వాహకులను అభినందించారు. ఎల్లప్పుడు పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడీలో పిల్లలను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఆట బొమ్మలు, పెయింటింగ్స్ తదితర సౌకర్యాలపై అంగన్వాడీ టీచర్‌ను అభినందించారు. అంగన్వాడీ పరిసరాల్లో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. చిన్నపిల్లలతో అదనపు కలెక్టర్ కాసేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత గ్రామంలో గల చెత్త సెరిగేషన్ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సరిగేషన్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలలో నిర్మల్ సీడీపీవో నాగమణి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మహేశ్, అంగన్వాడీ టీచర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
