- కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి చేసుకుందాం
- కొట్లాడుకునే జమానా పోయింది
- గతంలో నన్ను ఏ కార్యక్రమానికీ పిలవలేదు
- బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాలు ప్రారంభోత్సవంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాజీ సర్పంచులంతా పెండింగ్ బిల్లులు రాక అల్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను అర్థం చేసుకుని వెంటనే ఆ బిల్లులను చెల్లంచి వేలాది మంది సర్పంచులను ఆదుకోవాలని కోరారు. జెండాలను, ఎజెండాలను, బేషజాలను పక్కనపెట్టి అభివృద్దే లక్ష్యంగా పనిచేద్దామని సూచించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తోందన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూ.3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్ భవన ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసే ఉంటాం. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాం. కొట్లాడుకునే జమానా పోయింది. గతంలో నన్ను ఏ అభివృద్ది కార్యక్రమానికి పిలవకపోయేవారు. ఈసారి పిలిచారు. వచ్చిన. ఈరోజు రూ.3 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నం. యూరియా కొరత లేకుండా చేస్తున్నాం.
అట్లాగే ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోదీదే. ఒక్కో యూరియా బస్తా మీద రూ. 2,236 లు సబ్సిడీ ఇస్తున్నాం. రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎరువుల కొరత అనేది లేకుండా, చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసే పనిలేకుండా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. యూరియా బస్తాలు మోసే పనిలేకుండా నానో యూరియా ప్యాకేట్లను అందిస్తోంది. అట్లాగే ఈ వేదిక మీద కోరుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా 12వేల 769 మంది తాజా మాజీ సర్పంచులున్నరు. వీళ్లందరికీ దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాలి. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకుగాను ఒక్కో సర్పంచుకు 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా పల్లె ప్రగతి, రైతు వేదిక, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రక్రుతి వనం, హరిత వనం, కమ్యూనిటీ హాల్, హైమాస్ లైట్స్, అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కళ్ల ముందే కన్పిస్తున్నాయి. ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచులవల్లే. గ్రామ పంచాయతీల్లో ఆయా అభివృద్ది పనులన్నింటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులను విడుదల చేయడంవల్లే ఈ అభివృద్ధి సాధ్యమైంది. కానీ చేసిన పనులకు సంబంధించి బిల్లులివ్వకుండా మాజీ సర్పంచులను వేధించడం సరికాదు. వాళ్లబాధను అర్ధం చేసుకుని వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందనే భావిస్తున్నా. మానకొండూరు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గతంలో గన్నేరువరం బేగంపేట రోడ్డు నిర్మించాలని నా వెంట పడ్డారు. అది శాంక్షన్ కాగానే ఇప్పుడు గన్నేరువరంపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు. తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.
అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కువగా కొట్లాడితే, ఆవేశ పడితే ఆరోగ్యం ఖరాబైతది. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికల తరువాత అభివృద్ధే ఎజెండా. నాకైనా ఓట్లేసింది ప్రజలే. కవ్వంపల్లి సత్యనారాయణకైనా, గెలిచిన బీఆర్ఎస్ నేతలకైనా ఓట్లేసింది ప్రజలే. కాబట్టి అందరం కలిసి ప్రజల కోసమే పనిచేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నది నా ఉద్దేశం. మేమైతే ఎలాంటి బేషజాలు లేకుండా పనిచేస్తాం. ఎక్కడైనా సర్వసభ్య సమావేశం పెడితే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అది సరికాదు. మన దగ్గర ఇకపై అలాంటి పరిస్థితి రావొద్దు. కలిసి కట్టుగా పనిచేసి ప్రజల కోసం పనిచేద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తేలికగా రుణాలు పొందే వెసులు బాటు ఉంది. దానిని వినియోగించుకోవాలని రైతులను కోరుతున్నా. అట్లాగే లోన్లు తీసుకున్న వారంతా సకాలంలో చెల్లిస్తే.. మిగిలిన వాళ్లకు కూడా ఈజీగా లోన్లు ఇచ్చే అవకాశముంది. తద్వారా ప్రాథమిక సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నా. కార్పొరేట్ స్థాయిలో ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన శరత్ రావును అభినందిస్తున్నా. గతంలో గన్నేరువరం బెజ్జంకి రోడ్డు విషయంలో ఎవరో రాసి ఇచ్చిన దానిని చూడకుండా అప్పటికప్పుడు చదివిన. ఆ తరువాత ఇక్కడోళ్లే నా దిష్టిబొమ్మలు తగలబెట్టారు. కొందరైతే నా చావును కూడా కోరుకున్నారు. ఈసారి అట్లాకాకుండా అన్ని ఆలోచించే హామీలిస్తా. మీరు రాసిచ్చిన దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా.’ అని బండి సంజయ్ అన్నారు.
